ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం జగన్ కు చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ లోని అసైన్డ్ భూములను వెనక్కు తీసుకుంది. ఈ మేరకు పల్నాడు ప్రాంతంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకుంటూ స్థానిక తహసీల్దార్ ఉత్తర్వులు ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ ఈ భూములను పరిశీలించారు. జగన్ భూములను చెరబట్టారని ఆరోపిం చారు. దీని పైన జగన్ స్పందించారు. అధికారులు ఇచ్చిన నివేదికను ప్రస్తావించారు. ఇప్పుడు ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
భూముల వివాదం
పల్నాడులో జగన్ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కోసం భూములు తీసుకున్నారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలోనూ ఈ భూ కేటాయింపులు జరిగాయి. దీని పైన అప్పట్లోనే వివాదం చోటు చేసుకుంది. అయితే, ఆ తరువాత జగన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. జగన్ -షర్మిల వివాదం లోనూ సరస్వతి పవర్ అంశం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కాగా, కొద్ది రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ పల్నాడులో సరస్వతి పవర్ కు కేటాయించిన భూములను పరిశీలించారు. ఆ సమయంలోనే 1324. 93 ఎకరాల భూమిని చెరబట్టారని ఆరోపించారు. అప్పటికే అధికారుల నుంచి ఈ భూముల పైన నివేదిక కోరారు.
పవన్ ఎంట్రీతో
సరస్వతికి కేటాయించిన భూముల్లో అటవీ, అసైన్డ్ లాండ్స్ ఉన్నాయనేది పవన్ ఆరోపణ. 34 ఎకరాల అసైన్ట్ భూమిని సైతం కబ్జా చేశారని పవన్ పేర్కొన్నారు భూములు ఇవ్వని వారిని బాంబు లతో బెదిరించారని చెప్పుకొచ్చారు. ఈ భూములను ఏకంగా జగన్ తాను అధికారంలో ఉండగా 50ఏళ్లకు లీజు తీసుకున్నట్లు జీవో విడుదల చేశారని మండిపడ్డారు. ఈ విమర్శల పైన జగన స్పందించారు. అధికారులు ఈ ప్రభుత్వ హయాంలోనే విచారించి ఎలాంటి ప్రభుత్వ భూములు లేవని చెప్పిన అంశాన్ని ప్రస్తావించారు. గతంలోనూ భూముల విషయంలో నాటి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. తాను కోర్టుకు వెళ్లానని గుర్తు చేసారు.
భూములు వెనక్కు
తాను అక్కడ ఇతర సంస్థలు ఇచ్చిన ధర కంటే ఎక్కువ ఇచ్చి భూములు తీసుకున్నానని జగన్ వివరించారు. కాగా, ఇప్పుడు పల్నాడులోని సరస్వతి పవర్ లో అసైన్డ్ భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకుం ది. మొత్తం 17.69 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. మాచవరం మండలం వేమవరంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లిలో 3.89 ఎకరాలు వెనక్కు తీసుకుంది. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేసారు. ఇక, ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం పైన జగన్ ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి.
