తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అష్ట కష్టాలు పడుతూ అస్తిత్వ పోరాటం కొనసాగిస్తున్న బీఆర్ఎస్ పార్టీలో జవజత్వాలు నింపడం కోసం బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలలోకి వెళుతున్న కేసీఆర్ త్వరలో బస్సు యాత్రను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
వారి కోసం రంగంలోకి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా తన పర్యటనలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని, ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరువు తాండవిస్తోందని కరువు కారణంగా రైతులు పంటలు ఎండిపోయి నానా అవస్థలు పడుతున్నారని, కష్టాలలో ఉన్న రైతాంగానికి భరోసా ఇవ్వడానికి రాష్ట్రవ్యాప్తంగా ఆయన బస్సు యాత్రలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.
ఏప్రిల్ 18న ముఖ్యనేతలతో కీలక సమావేశం అయితే ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలతో ఏప్రిల్ 18వ తేదీన సమావేశం నిర్వహించి కెసిఆర్ బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ పై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. అంతేకాదు ఈ నెల 18న జరగనున్న పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో లోక్ సభ ఎన్నికలకు ఎలా ప్రజలవద్దకు వెళ్ళాలి అన్న అంశంపైన కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
రైతాంగం కోసం రంగంలోకి కేసీఆర్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ రైతులకు ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చటం లేదని రైతులు కష్టాల్లో ఉంటే భరోసా ఇవ్వడం లేదని గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో రైతాంగానికి ఎలాంటి కష్టం లేకుండా చూసుకున్నామని చెప్పే ప్రయత్నం చెయ్యనున్నారు కేసీఆర్.
కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన కరువు ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తీసుకువచ్చిన కరువని ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్న కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత టార్గెట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించాలని, ఓపక్క ఎన్నికల ప్రచారం చేస్తూనే, మరోవైపు రాష్ట్రంలోని అసమర్ధ పాలనను టార్గెట్ చేసి కాంగ్రెస్ కు చెక్ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు.
