ఈనెల 18వ తేదీ నుంచి ఏపీలో నామినేషన్ల పర్వం ప్రారంభం కాబోతోంది. ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్ కు గురైనట్లు తెలుస్తోంది. ఆయన వాడుతున్న ఫోన్ యాపిల్ కంపెనీది కావడంతో అక్కడి నుంచి ఫోన్ కు సెక్యూరిటీ అలర్ట్ నోటిఫికేషన్ వచ్చింది. ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కంపెనీ లోకేష్ కు సూచించినట్లు తెలుస్తోంది. యాపిల్ కంపెనీ నుంచి నారా లోకేష్ కు మెయిల్ వచ్చినట్లు సమాచారం.
నారా లోకేష్ ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ కొద్దిరోజులుగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం టీడీపీ వర్గాల్లో కలకలం రేకెత్తిస్తోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. ఆ పార్టీ రాజ్యసభ మాజీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఈసీకి లేఖ రాశారు. గుర్తు తెలియని ఏజెన్సీలద్వారా పెగాసస్ సాఫ్ట్ వేర్ సహాయంతో ట్యాపింగ్ కు ప్రయత్నించినట్లు ఐఫోన్ కు సందేశాలు వచ్చాయని తెలిపారు. గత నెలలో కూడా ఇటువంటి సందేశాలే వచ్చాయని, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటిలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని, వైసీపీకి సహకరిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని కనకమేడల మండిపడ్డారు.ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు.
కూటమిపై వీరంతా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, రెండు సంవత్సరాల నుంచి రాజేంద్రనాథ్ రెడ్డి ఇన్ ఛార్జిగానే కొనసాగుతున్నారన్నారు. ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాజేంద్రనాథ్ రెడ్డి నియామకం పూర్తి విరుద్ధమన్నారు. ఆంజనేయులుపై అనేక ఆరోపణలున్నాయని, వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈసీకి రాసిన లేఖలో కనకమేడల కోరారు. నిస్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించాలన్నారు.
