వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కుప్పంలో లక్ష ఓట్లతో గెలుస్తా..

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన సంయుక్తంగా ఎన్నికల సమర శంఖాన్ని పూరించాయి. ఎన్నికల రణభేరిని మోగించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.

 

పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం సమీపంలో గల ప్రతిపాడు వద్ద ఉమ్మడి బహిరంగ సభను ఏర్పాటు చేశాయి టీడీపీ-జనసేన. దీనికి తెలుగు జన విజయ కేతనం జెండాగా పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈ సభకు లక్షలాది మంది తరలివచ్చారు. 21 ఎకరాల్లో ఈ సభను ఏర్పాటు చేయగా.. స్థలం చాలలేదు. కిటకిటలాడింది.

 

ఈ సభను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో వివరించారు. రాష్ట్ర భవిష్యత్తుకు ఈ ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకమైనవని అభివర్ణించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ- జనసేన కలిసి ఎన్నికల బరిలో దిగాయని వివరించారు.

 

పవన్ కల్యాణ్‌తో చేతులు కలిపింది ఎవరి ప్రయోజనాల కోసమో కాదని, రాష్ట్రం కోసమేనని తేల్చి చెప్పారు చంద్రబాబు. అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో జనసేనతో పొత్తు పెట్టుకోలేదని పేర్కొన్నారు. తన కోసమో, పవన్ కల్యాణ్‌కు రాజ్యాధికారం కోసమో కాదని అన్నారు. యువత, విద్యార్థులు, పుట్టిన బిడ్డల కోసం, పుట్టబోయే బిడ్డల కోసం, వారి భవిష్యత్తు కోసం పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు.

 

విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని నిలబెట్టడానికి, హత్యకు గురైన ప్రజాస్వామ్యాన్ని తిరిగి బతికించడానికి తాము చేతులు కలిపామని చంద్రబాబు పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం, ప్రభుత్వ బాదుడుతో ఛిద్రమౌతున్న పేద వాడిని ఆదుకోవడానికి తాము కలిశామని అన్నారు.

 

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి తాము చేతులు కలిపామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేశాడని ఆరోపించారు. ఆ వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం తమపై ఉందని అన్నారు.

 

వైఎస్ జగన్.. కనికట్టుతో ప్రజలను మోసం చేస్తోన్నాడని చంద్రబాబు విమర్శించారు. కుప్పానికి ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి కాలువల్లో పోశాడని, గేట్లను తీసుకెళ్లి అక్కడ పెట్టాడని విమర్శించారు. వాటికి కృష్ణాజలాలు అని పెట్టాడని మండిపడ్డారు. సినిమా సెట్టింగులతో హంద్రీ నీవా జలాలను విడుదల చేశాడని ధ్వజమెత్తారు. కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తానని సవాల్ విసిరారు.

Posted Under AP
Editor