పండగపూట ప్రెస్‌మీట్ పెట్టించారు: కేటీఆర్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్..

పండగపూట తనతో ప్రెస్‌మీట్ పెట్టించారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అసహనం వ్యక్తం చేశారు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ నియోజకవర్గంలో మల్లేశ్ హత్యను రాజకీయంగా వాడుకోవడం కేటీఆర్ స్థాయికి దగదని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ.. మరీ ముఖ్యంగా తాను హత్యా రాజకీయాలను ప్రోత్సహించే ప్రసక్తే లేదన్నారు.

 

స్థానిక నాయకులు చెప్పగానే వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం మంచిది కాదని జూపల్లి కృష్ణారావు హితవు పలికారు. కేటీఆర్.. ఆయన స్థాయిని ఆయనే తగ్గించుకుంటున్నారన్నారు. ఎన్నికలకు ముందు కుటుంబం, భూతదాగాలతో మల్లేశ్ హత్య జరిగినట్లు దర్యాప్తులో తేలిందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. మల్లేశ్ హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరైంది కాదన్నారు.

 

 

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక తప్పుడు కేసులు పెట్టారని.. ఆధారాలతో సహా పోలీసులు, ప్రగతిభవన్ ప్రముఖులకు పంపించినా ఆనాడు ఎవరూ స్పందించలేదన్నారు. కొండగట్టు వద్ద ప్రమాదంలో 60 మంది చనిపోయినా.. హైకోర్టు న్యాయవాది వామన్ రావు దంపతులు నడిరోడ్డుపై హత్యకు గురైతే పరామర్శించేందుకు వెళ్లని కేటీఆర్.. ఇక్కడికి వెళ్లడం రాజకీయం కాదా? అని జూపల్లి ప్రశ్నించారు.

 

ఏం జరిగింది? కేటీఆర్ ఏమన్నారంటే? నాగర్‌ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లికి చెందిన మల్లేశ్ ఇటీవల హత్యకు గురయ్యారు. మాజీ మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌లతో కలిసి కేటీఆర్ ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్పార్టీ తరపున రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో హత్యా రాజకీయాలు మంచివి కాదని, కార్యకర్తలపై దాడులు చేయడం సరికాదన్నారు కేటీఆర్. కింది స్థాయి కార్యకర్తలను సమిధలను చేయడం భావ్యం కాదన్నారు. మల్లేశ్హత్యపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డీజీపీ, ఎస్పీని కేటీఆర్ కోరారు. ఈ నేపథ్యంలోనే జూపల్లి కౌంటర్ ఇచ్చారు.

Editor