టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల్లో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది. చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటీషన్ల పైన ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగుతున్నాయి.
నేడు జరిగే విచారణ కీలకం కానుంది. ఇప్పటికే మూడో సారి చంద్రబాబు రిమాండ్ ను పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9న సుప్రీంలో చంద్రబాబు క్వాష్ పిటీషన్ పైన విచారణ జరగనుంది. దీంతో, ఈ రోజు ఏసీబీ కోర్టులో పరిణామాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది.
ఏసీబీ కోర్టులో విచారణ: చంద్రబాబు బెయిల్ పైన ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇదే సమయంలో చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటీషన్లు విచారణలో ఉన్నాయి.గత రెండు రోజులపాటు కొనసాగుతున్న వాదనలు ఈ రోజు కొనసాగనున్నాయి.చంద్రబాబు తరపున ప్రమోద్‌కుమార్ దూబే.. సీఐడీ తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు.
చంద్రబాబును గురువారం ఏసీబీ కోర్టు జడ్జి ముందు వర్చ్యువల్ గా ప్రవేశ పెట్టారు. ఈ నెల 19వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ రోజు బెయిల్ పిటిషన్ లో చంద్రబాబు లాయర్ దూబే వాదనలకి ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి రిప్లై ఇవ్వనున్నారు. బాబు బెయిల్ అభ్యర్థనను డిస్మిస్ చేయాలని వాదించారు.
కస్టడీ కోరిన సీఐడీ: స్కిల్ స్కామ్‌లో బాబే ప్రధాన సూత్రధారి అనేందుకు పక్కా ఆధారాలున్నాయని కోర్టుకు వెల్లడించారు. ఆర్ధిక శాఖ అభ్యంతరాలని పట్టించుకోకుండా 13 చోట్ల సంతకాలు చంద్రబాబు చేసారని వాదించారు. రూ.370 కోట్ల నిధుల విడుదలపై అప్పటి ఆర్దికశాఖ ఉన్నతాధికారి సునీత అభ్యంతరాలతో కూడిన నోట్ ఫైల్ కోర్టుకి సమర్పించారు. టీడీపీ ఖాతాలోకి రూ.27 కోట్లు జమ అయ్యాయని బ్యాంకు ఖాతాల వివరాలు సమర్పించినట్లు తెలుస్తోంది.
చంద్రబాబుకి బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని చెప్పారు. నేడు కూడా పొన్నవోలు తన వాదనలు కొనసాగించనున్నారు. ఆ తర్వాతే సీఐడీ కస్టడీ పిటిషన్‌పై పొన్నవోలు వాదనలు కొనసాగనున్నాయి. స్కిల్ కుంభకోణంలోచంద్రబాబు పాత్రపై ఆధారాలున్నాయని, కస్టడీకి ఇస్తే కేసుకు సంబంధించి లోతైన విచారణ జరుగుతుందని కోరారు.
కలవనున్న కుటుంబ సభ్యులు: రాజమండ్రి జైల్లో చంద్రబాబను ఈ రోజు కుటుంబ సభ్యులు కలవనున్నారు. భార్య భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి కలిసేందుకు అనుమతి తీసుకున్నారు. 23 రోజులు ఢిల్లీలో ఉన్న లోకేశ్ తిరిగి రాజమండ్రికి చేరుకున్నారు. ఈ నెల 12న ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్‌ను ఏపీ సీఐడీ విచారించనుంది.
కోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పటికే నోటీసులు అందజేసారు. అటు సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ విచారణ ఈ నెల 9న జరగనుంది. ఇటు హైకోర్టులోనూ ముందస్తు బెయిల్ పిటీషన్ల పైన విచారణ పెండింగ్ లో ఉంది. ఈ క్రమంలో ఈ రోజు ఏసీబీ కోర్టు చంద్రబాబు బెయిల్.. కస్టడీ పైన ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తారనేది ఆసక్తిగా మారుతోంది.
