Latest Posts

ఎన్నికల బరిలో హైదరాబాదీ “నాటు” రాహుల్ సిప్లిగంజ్..!

హైదరాబాద్ : బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ అధ్యక్ష్యా అనేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. టీవీ సినీ రంగంలో సక్సెస్ అయిన రాహుల్ ఇక పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమయ్యారు.

డైరెక్ట్‌గా ఎలక్షన్ ఫైట్‌లోకి దిగుతున్నారు. తన యాస భాషతో పక్క హైదరాబాదీ పాతబస్తీ వాసిగా గుర్తింపున్న మంగళ్‌హాట్ బిడ్డ రాహుల్ సిప్లిగంజ్ ఎన్నికల్లో గోషామహల్ తన అడ్డాగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

RRR సాంగ్‌తో ఆస్కార్ విన్నర్‌గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గోషామహల్ నుంచి బరిలో దిగేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి దరఖాస్తు చేసుకున్నారు. ముందుగానే కాంగ్రెస్ పెద్దలతో జరిగిన చర్చలు ఒప్పందం మేరకే దరఖాస్తు చేసినట్లు సమాచారం. రాహుల్ సిప్లిగంజ్ పుట్టింది పెరిగిందంతా మంగళ్‌హాట్ ఏరియానే. మంచి మాస్‌ ఫాలోయింగ్ ఉన్న రాహుల్ గోషామహల్‌కు సరైన అభ్యర్థిగా కాంగ్రెస్ భావిస్తోంది.

గోషామహల్ తొలి నుంచి కాంగ్రెస్‌కు కంచుకోట.గత రెండు ఎన్నికల్లోనూ బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ గెలుపొందారు. రానున్న ఎన్నికల్లో ఆయన పోటీచేస్తారా లేదా అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. అదే సమయంలో కేసీఆర్ అభ్యర్థులను ఖరారు చేసి పెండింగ్ పెట్టిన నియోజకవర్గాల్లో గోషామహల్ ఒకటి. దీంతో ప్రధాన పార్టీల్లో గోషామహల్ పై ఫోకస్ పెరిగింది. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రాహుల్‌ను ఎంచుకుంది.

బిగ్‌బాస్‌తో పాటుగా పలు సినిమాలకు మాస్ సాంగ్స్ అందించిన రాహుల్ RRRతో ఒక్కసారిగా ఇమేజ్ పెంచుకున్నారు. అసలైన తెలంగాణ యాస, సిసలైన నాటుపాటతో హైదరాబాదీ స్టయిల్‌ను ప్రపంచవ్యాప్తం చేశాడు. దీంతో పార్టీలు, వర్గాలకు అతీతంగా రాహుల్ పై క్రేజ్ పెరిగింది.కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు ఏరికోరి కాంగ్రెస్‌కు దగ్గరయ్యేలా చేశాడు. నేరుగా రేవంత్‌తో మాట్లాడిచ్చాడు. గోషామహల్‌లో గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, సున్నిత అంశాలపై వివాదాలతో స్థానికులు విసిగిపోయారు.

ఈ క్రమంలో పక్కా హైదరాబాదీ బ్రాండ్ మంగళహాట్ పోరగాడు గోషామహల్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. అటు బీఆర్ఎస్ కూడా రాహుల్, రాజాసింగ్ అభ్యర్థిత్వాలపై క్లారిటీ వచ్చాకే తమ క్యాండిడేట్‌ను ఫైనల్ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి రాహుల్ సిప్లిగంజ్‌కు సీట్ పక్కా అని చెబుతున్నారు.బిగ్‌బాస్, ఆస్కార్ అవార్డు విజేతగా నిలిచిన రాహుల్ గోషామహల్ విన్నర్‌గా నిలుస్తారా లేదా అనేది మూడు నెలల్లో తేలిపోనుంది.

Editor