Latest Posts

తెలంగాణలో ఐదు రోజులపాటు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

హైదరాబాద్: రాజధాని నగరంతోపాటు తెలంగాణ జిల్లాల్లో గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు హైదరాబాద్ తోపాటు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

ఇక రానున్న ఐదు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

బుధవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండలో భారీ వానలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. శుక్రవారం నుంచి శనివారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.

శనివారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. బయటకు వెళ్లే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సీజనల్ వ్యాధులు వస్తున్న క్రమంలో పరిశుభ్రతను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

మరోవైపు, ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల భారీ ఆస్తి నష్టాన్ని కలిగించాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా 50 మందికిపైగా మరణించారు. వందలాది ఇళ్లు పూర్తిగా ధ్వంసం కావడంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు.

YES9 TV