జనసేనకు గాజు గ్లాసు గుర్తుపై ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం, కానీ..!!

జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కొనసాగింపు పై కీలక నిర్ణయం వెలువడింది. జనసేనకు గుర్తును కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

జనసేనను రిజర్వుడు సింబల్ కలిగిన రిజిస్టర్డ్ పార్టీల జాబితాలోనే ఉంచింది.

టీడీపీ..వైసీపీలను గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాల వాటి గుర్తులతో కొనసాగిచింది. అయితే , స్థానిక సంస్థల ఎన్నికల వరకు మాత్రమే ఈ గుర్తు అమల్లో ఉంటుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

 

గాజుగ్లాసు గుర్తు కొనసాగింపు: స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీకి గాజుగ్లాసు గుర్తును కేటాయిస్తూ ఏపీ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు ఇచ్చింది. గుర్తింపు పొందిన జాతీయ పార్టీగా సీపీఐ, ఎన్సీపీలను గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలుగా జాబితాలో చేర్చింది. ప్రస్తుతం గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీ జాబితాలో ఉన్న ఆర్ఎల్డీని రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో చేర్చుతూ నిర్ణయించింది.

ఈ పార్టీకి ఎలాంటి గుర్తు రిజర్వు చేయలేదు. బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాలో ఉండేది. ఈ పార్టీ కొత్త పేరు..వివరాలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద దరఖాస్తు చేసుకుంటే ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాతో చేర్చి కారు గుర్తు కొనసాగించనుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

అసెంబ్లీ ఎన్నికల్లో లేనట్లేనా: ఏపీలోని పార్టీలకు గుర్తుల కేటాయింపుల పైన కొంత కాలం క్రితం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీలోని మూడు ప్రాంతీయ పార్టీలకు రిజర్వుడ్‌ గుర్తుల కేటాయింపు జరిగింది. ఏపీతో పాటుగా 8 జాతీయ పార్టీలకూ రిజర్వుడ్‌ గుర్తులు ఖరారు చేసింది. అయితే, వాటిలో జనసేన పార్టీ పేరు ప్రస్తావన లేదు. దీంతో..జనసేన సింబల్ గా ఉన్న గాజు గ్లాసు ఇక ఉండదని చెబుతున్నారు.

Posted Under AP
YES9 TV