పసిఫిక్ దీవుల్లో 7.2 తీవ్రతతో భారీ భూకంపం- ఉలిక్కిపడ్డ యూఎస్, ఆస్ట్రేలియా..

పసిఫిక్ మహాసముద్రంలో ఇవాళ భారీ భూకంపం చోటుచేసుకుంది. పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా సమీపంలో 7.2 తీవ్రతతో కూడిన భూకంపం కుదిపేసింది. దీంతో పసిఫిక్ తీరం కలిగిన దేశాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.

ఓ దశలో సునామీ హెచ్చరికలు జారీ చేసేలా పరిస్దితులు కనిపించాయి. కానీ అలాంటీదేమీ లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ భూకంపాన్ని యూఎస్, ఆస్ట్రేలియా నిర్ధారించాయి.

యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) నివేదిక ప్రకారం దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా సమీపంలో ఇవాళ 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం టోంగాకు నైరుతి దిశలో 280 కిమీ (174 మైళ్ళు) 167.4 కిమీ (104 మైళ్ళు) లోతులో ఉన్నట్లు నిర్ధారించారు. భూకంపం తర్వాత యుఎస్ పశ్చిమ తీరం, బ్రిటిష్ కొలంబియా లేదా అలాస్కాకు సునామీ ముప్పు లేదని యుఎస్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది.

పసిఫిక్ లో చోటు చేసుకున్న ఈ భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలు కూడా చేసే అవకాశమున్నట్లు భావించారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాకు ప్రమాదం ఉందని భావించినా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ మెటియోరాలజీ సునామీ ముప్పు లేదని తెలిపింది. యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) మొదట ఫిజీ దీవుల దక్షిణ ప్రాంతానికి సమీపంలో భూకంపం యొక్క తీవ్రతను 7గా నిర్ధారించింది.

YES9 TV