ఎక్కడ పట్టణ ప్రగతి? బోధన్ పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఘర్షణ!!

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పట్టణ ప్రగతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణాలలో సాధించిన ప్రగతిని ప్రజలకు తెలియజేసేలా ఇలా వివిధ కార్యక్రమాలను చేపట్టారు.

అయితే నిజామాబాద్ బోధన్ లో మాత్రం పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది.

బోధన్ పట్టణ ప్రగతి దినోత్సవ కార్యక్రమంలో ఎంఐఎం, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. పట్టణంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆర్డీవో రాజేశ్వర్ ను ఎంఐఎం నాయకులు నిలదీశారు. దేని కోసం పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపించాలని అన్నారు. ఇదిలా ఉంటే స్థానిక ఎమ్మెల్యే షకీల్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.

మున్సిపల్ చైర్మన్ తూము పద్మా శరత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా అధికారులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొంటున్న సమయంలో ఎంఐఎం కార్యకర్తలు ఆందోళన చేయడంతో పాటు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సభాస్థలి నుంచి ఎంఐఎం నాయకులను పోలీసులు బయటకు పంపించారు. అయితే గత కొంత కాలంగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు.

స్థానిక మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డికి, షకీల్ కు మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయి. స్థానిక మున్సిపల్ చైర్మన్ బోధన్ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ప్రస్తుతం బోధన్ ఎమ్మెల్యే షకీల్ వారిపై గుర్రుగా ఉన్నారు. ఇక ఈ క్రమంలో ఎంఐఎం కార్యకర్తలు పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఘర్షణలకు దిగడం బోధన్ నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయాలకు కారణంగా మారింది.

YES9 TV