విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబాన్ని ఇవాళ గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. ఇవాళ ఉదయం వైజాగ్ ఎంపీ భార్య, కుమారుడిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు, అనంతరం వారితో ఫోన్ చేయించి ఆడిటర్ ను సైతం ఎత్తుకుపోయారు.
అయితే విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం తొలుత ఆడిటర్ జీవీ సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఎంపీ భార్య, కుమారుడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుండగానే వారు కూడా సురక్షితంగా ఉన్నట్లు తేలింది.
ఇవాళ ఉదయం విశాఖలోని రుషికొండలో ఉన్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడిని ముందుగా కిడ్నాప్ చేసిన అగంతకులు .. అనంతరం ఆడిటర్ కు వీరితో ఫోన్ చేయించి కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ జరిగిన సమయంలో ఎంపీ సత్యనారాయణ హైదరాబాద్ లో ఉన్నారు. ఆర్ధిక లావాదేవీల కారణంగానే ఈ కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఎంపీ భార్య, కుమారుడిని ఆగంతకులు ఎక్కడికి తీసుకెళ్లారనేది తెలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. వీరిని విశాఖ-ఏలూరు జాతీయ రహదారి సమీపంలో గుర్తించినట్లు తెలుస్తోంది.
