న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికే వంటనూనెల ధరలు సలసల కాగుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో ఒక లీటర్ వంటనూనె 130 రూపాయలకు పైమాటే. గతంలో ఎప్పుడూ లేని విధంగా వంట నూనెల ధరలు మండిపోయాయి.
వాటిని కొనాలంటే ఒకటి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. వంట నూనెలపై చేసే ఖర్చును తగ్గించుకోవడానికీ కొనుగోలుదారులు ప్రాధాన్యత ఇస్తోన్నారు.
కాగుతున్న వంటనూనె ధరలను తగ్గించడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సన్ ఫ్లవర్, సోయాబీన్ నూనె దిగుమతులపై వసూలు చేస్తోన్న కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సన్ ఫ్లవర్‌పై వసూలు చేస్తోన్న కస్టమ్స్ డ్యూటీలో 17.5 శాతం, సోయా బీన్ వంటనూనెపై వసూలు చేస్తోన్న కస్టమ్స్ డ్యూటీలో 12.5 శాతం మేర తగ్గించింది.

ఇదివరకు అయిదు శాతం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్‌ను ఎత్తివేసిన విషయం తెలిసిందే. 2024 మార్చి వరకు కస్టమ్స్ డ్యూటీ, అగ్రిసెస్ ఎత్తివేత అనేది కొనసాగుతుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సోయాబీన్, సన్‌ఫ్లవర్ క్రూడ్‌పై అప్పట్లో 20 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఈ కస్టమ్స్ డ్యూటీ, అగ్రిసెస్ ఎత్తివేతను వర్తింపజేసింది కేంద్ర ప్రభుత్వం.
వంటనూనెలను దిగుమతి చేసుకోవడంలో ప్రపంచలోనే అతిపెద్ద దేశం.. భారత్. నిత్యావసర సరుకుల ధరలు, వంటనూనె రేట్లు అమాంతంగా పెరిగిపోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో- వాటిని నియంత్రించడంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ తాజా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ చర్యల వల్ల వంటనూనె ధరలు తగ్గుముఖం పడతాయని, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ విభాగం వెల్లడించింది.
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసు- బీజేపీ ఎంపీపై ఛార్జ్‌షీట్
దిగుమతి చేసుకున్న సోయాబీన్ నూనె టన్ను ఒక్కింటికి 970 డాలర్లను కేంద్రం చెల్లిస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే 43 శాతం తగ్గింది. దిగుమతి చేసుకున్న సన్‌ఫ్లవర్ ఆయిల్ టన్నుకు సుమారు 860 డాలర్లను చెల్లిస్తోంది. గతంతో పోల్చుకుంటే ఈ 55 శాతం మేర తగ్గింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం తాజాగా సోయాబీన్, సన్‌ఫ్లవర్ దిగుమతులపై వసూలు చేస్తోన్న కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
