ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రంలో ఆ పార్టీ మద్దతు కోసం జట్టు కట్టిన బీజేపీ.. రాష్ట్రానికి చేసిందేమీ లేకపోయినా ఏపీలో అధికార పార్టీని మాత్రం ఫుల్లుగా వాడేసుకుంది.
ఈ క్రమంలో వైసీపీ పలు విమర్శలు ఎదుర్కొన్నా అంతిమంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి కాస్తో కూస్తో ప్రయోజనం లభిస్తుందని ఆశించింది. అయితే తాజాగా రెవెన్యూ లోటు భర్తీ కింద నిధుల విడుదల మినహాయించి బీజేపీ చేసిందేమీ లేదు. కానీ ఎన్నికల్లో మాత్రం వైసీపీకి వ్యతిరేకంగా పోరుకు సిద్ధమైంది.
తాజాగా వైసీపీ సర్కార్ పై అమిత్ షా, జేపీ నడ్డా చేసిన విమర్శల్ని అధికార పార్టీ త్వరగానే గ్రహించి ఎదురుదాడి మొదలుపెట్టేసింది. అయితే సీఎం జగన్ మాత్రం ఇతర విపక్షాలు టీడీపీ, జనసేనతో బీజేపీని కలిపి విమర్శించేందుకు అంత త్వరగా సిద్ధపడలేదు. కేవలం బీజేపీ మద్దతు మనకు ఉండకపోవచ్చంటూ ఓ హింట్ మాత్రం ఇచ్చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ మద్దతు లేకుండానే తాము బరిలోకి దిగుతున్నట్లు జగన్ ప్రకటించేసినట్లయింది.
