దేశంలో గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలంటూ గత కొన్నాళ్లుగా బీజేపీ యేతర ముఖ్యమంత్రులు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో గవర్నర్ లను పావులుగా వాడుకుంటూ ప్రభుత్వాలపై కక్ష సాధిస్తుంది అంటూ గత కొన్నాళ్లుగా ఆరోపణలు వస్తున్న విషయం తెల్సిందే.
తెలంగాణ.. తమిళనాడు.. ఢిల్లీ ఇంకా పలు రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధినాయకత్వం గవర్నర్ ల సాయంతో పరిపాలనపై ప్రభావం చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో గవర్నర్ వ్యవస్థ తొలగించాలని డిమాండ్ వ్యక్తం అవుతోంది. తాజాగా ఈ విషయమై పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెట్టడం జరిగింది.
సీపీఐ ఎంపీ బినయ్ విశ్వమ్ పార్లమెంటులో ఓ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశ పెట్టారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేస్తూ రాజ్యాంగాన్ని సవరణ చేయాలంటూ ఆయన తన బిల్లులో పేర్కొన్నాడు. రాష్ట్రాల హక్కులను హరించే విధంగా కొన్ని రాష్ట్రాల గవర్నర్ లు వ్యవహరిస్తున్నారు అంటూ ఆయన ఆరోపించాడు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని కేంద్రంపై ఆరోపణలు చేస్తున్న విషయం తెల్సిందే. బినయ్ విశ్వమ్ పెట్టిన ఆ బిల్లు కనీసం చర్చకు కూడా వచ్చే అవకాశం లేదని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
