Latest Posts

మరో కొత్త వైరస్…

ప్రస్తుతం ఏ ఇంటి తలుపు తట్టినా ఎవరో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. అదే పనిగా దగ్గు.. తోడుగా శ్వాసకోశ సమస్యలు.. జ్వరం. దీనికి దేశవ్యాప్తంగా పంజా విసురుతోన్న ఇన్‌ఫ్లుయెంజానే కారణం. కొవిడ్‌ వైరస్‌తో సుదీర్ఘ పోరాటం జరిపి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటుండగా.. దాదాపు అదే లక్షణాలతో మరోసారి ఇబ్బంది ఎదురవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా, తాజా కేసులకు చాలావరకు ఇన్‌ఫ్లుయెంజా-ఏ ఉప రకం ‘హెచ్‌3ఎన్‌2’ వైరస్‌ కారణమని గుర్తించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ప్రతీ నలుగురిలో ఒకరు వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు.

ఇతర ఉప రకాలతో పోలిస్తే ఈ వైరస్‌ ప్రభావం ఎక్కువని, దీంతో ఆస్పత్రుల్లో చేరికలు పెరుగుతున్నాయని పేర్కొంది. రెండు, మూడు నెలలుగా హెచ్‌3ఎన్‌2 దేశమంతటా విస్తృతంగా వ్యాప్తిలో ఉందని ఐసీఎంఆర్‌కు చెందిన నిపుణులు చెబుతున్నారు. సాధారణ జ్వరంతో పాటు నిరంతరం దగ్గు రావడం, కొందరిలో శ్వాస కోశ సమస్యలు ముఖ్య లక్షణాలుగా పేర్కొంటున్నారు. కాగా, హైదరాబాద్‌లో ప్రతి నలుగురిలో ఒకరు జ్వరం/శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ లక్షణాలతో నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రికి రోజూ వందల మంది వస్తున్నారు. శ్వాసకోశ ఇబ్బందులతో తమ వద్దకు పది రోజుల నుంచి భారీగా కేసులు వస్తున్నట్లు హైదరాబాద్‌ పురానా హవేలీకి చెందిన వైద్యుడు డాక్టర్‌ వాహబ్‌ జుబైర్‌ తెలిపారు. ‘‘వైరల్‌ జ్వరాలు ఎక్కువశాతం పిల్లల ద్వారా కుటుంబంలోని అందరికీ సోకుతున్నాయి’’ అని డాక్టర్‌ రాహుల్‌ అగర్వాల్‌ అనే మరో వైద్యుడు పేర్కొన్నారు.

Editor